*ఓయ్.! ఓసారి..రా ! రమ్మని పిలవాలని వుంది.!
*నా పై నీ ప్రేమ కొలతలు తెలుసుకోవాలని వుంది"!!
*ఎందుకోగానీ,ఈరోజు మాత్రం వీటన్నిటికి దూరంగా వుందామె.!
ప్రేయసీ ప్రియుల మధ్య అలకలు,వాదాలు..
ప్రతివాదాలు,మౌనాలు..ఎదురు చూపులు,..
వీక్షణలు,నిరీక్షణలు,చిలిపితనాలు,పరాచికాలు
మారాములు మామూలే.ఒకరికోసం మరొకరు..
వేచి,చూచి,నిరీక్షించి,చివరకు కలుసుకున్నప్పుడు
వుంటుంది అసలు మజా..అదేదో తెలుసుకునే..
ముందు రమాదేవి రాసిన ఈ కవిత ను మీరూ ఓ సారి చదవండి..!
"ఒకసారి రా రమ్మని పిలవాలని ఉంది
వదలక మారాము చేయాలని ఉంది
నీ చేతిలో గోరింటాకు దిద్దాలని ఉంది
నాపై ప్రేమ కొలతలు తెలుసుకోవాలని ఉంది...
వాదాలు.. ప్రతివాదాలు
అలకలు... మౌనాలు
ఏమీ లేవు...... ఈవేళ
ఓయ్
నీతో నాలుగడుగులు
రెండు మాటలు
చిక్కని కాఫీ
మెత్తని ఓ వీడికోలు
చాలదా ఈ పూటకి...❤️
*ఆర్.రమాదేవి..!!
రమాదేవి తన జానర్లోనే రాసిన కవిత ఇది…..
ఓ ప్రేమ భావన.హృదయస్పందనను నాజూగ్గా
అక్షరాలకు అద్దే విద్య రమాదేవికి బాగా తెలుసు.
ఈ కవిత కూడా ఇదే కోవకు చెందుతుంది…..!
చాలాకాలం తర్వాత వాళ్ళిద్దరు కలిశారు..ఎప్పటి
లానే అతగాడిని ఒకసారి రా రమ్మని పిలవాలని,...
వదలక మారాము చేయాలని,అతని చేతిలో గోరిం
టాకు దిద్దాలని, తనపై అతనికున్న ప్రేమ కొలతలు తెలుసు కోవాలని ఉందామెకు..దీనికోసం ఎప్పుడూ
అతగాడితో వాదించేది ఆమె.అతగాడు మాత్రం…
ఊరుకుంటాడా!వాదానికి ప్రతివాదం చేస్తాడు…
అలక ఆమెకు మాత్రమే సొంతమా! తనూ అలుగు
తాడు.ఆమె మౌనం పాటిస్తే..తానూ మౌనమై పోతాడు…
అదేంటో గానీ…ఆరోజు…వాదాలు.. ప్రతివాదాలు అలకలు.. మౌనాలుఏమీ లేవు..అంతా ప్రశాంతం
గా వుంది. ఎందుకోగానీ,ఈరోజు మాత్రం వీటన్నిటికి దూరంగా వుందామె.!
ఈరోజు మాత్రం ఇవన్నీ… బంద్..గప్ చుప్ !…అంతే..!
ఎందుకంటే..?
ఈరోజు….
ఈ గోల,వాదనలు పక్కనపెట్టీ
అతగాడితో…నాలుగడుగులు,రెండు మాటలు,
ఓ కప్పు చిక్కని కాఫీ,కాస్తంత మెత్తని ఓ వీడికోలు ఈ పూటకి చాలనుకుంటోందామె..! ❤️
*ఎ.రజాహుస్సేన్…!!